దొంగ నోట్లు సరఫరా చేసే ముఠా అరెస్ట్:నెల్లూరు జిల్లా కావలిలో దొంగ నోట్లు సరఫరా చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసిన కావలి పోలీసులు వారి నుంచి లక్షా 47 వేల రూపాయల విలువ చేసే దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
రథోత్సవంలో అపశ్రుతి .. ఒకరు మృతి: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కోదండరామాలయంలో గ్రామస్థులు రథాన్ని లాగుతున్న సమయంలో గరికపాటి వీర వెంకయ్య రథచక్రం కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనపై గుడివాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రగిరి కొత్తపేటలో దొంగల హల్ చల్: తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేటలో దొంగలు హల్ చల్ చేశారు. ఒక ప్రైవేటు వైద్యశాలలో ఉన్న మెడికల్ షాప్లో సుమారు పదిహేను వేల రూపాయలు దోచుకెళ్లినట్లుగా డాక్టర్ సిద్దయ్య తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి సీఐ శ్రీనివాసులు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ఆటోలను దొంగలించే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్: విజయవాడ నగర పరిధిలో ఆటోలను దొంగిలించే అంతరాష్ట్ర దొంగలను భవానీపురం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయ్యద్ నవాజ్, మహమ్మద్ అలీఫ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ నగర డీసీపీ బాబురావు తెలిపారు.
బురిడీ బాబా అరెస్ట్: ప్రత్యేక పూజలు చేస్తానని నమ్మించి బురిడీ కొట్టించే కిలాడీ నేరస్తుడిని విజయవాడ నగర కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కోట్ల హరికృష్ణ అలియాస్ నాగరాజు అలియాస్ నూకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 260 గ్రాముల బంగారం, రూ ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బాబురావు తెలిపారు.
తొమ్మిది లక్షలతో ఉడాయించిన మెప్మా రిసోర్స్ పర్సన్: ప్రకాశం జిల్లా కనిగిరిలో రూ.9 లక్షలతో మెప్మా రిసోర్స్ పర్సన్ ఉడాయించింది. బ్యాంకులో జమచేస్తానని చెప్పి రూ.9 లక్షలతో పారిపోయింది. ఈ ఘటనపై పొదుపు సంఘాల మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.