ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Today Crime in AP: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. పది మంది మృతి - ఏపీ క్రైం న్యూస్

Today Crime in AP: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కసింకోటలో విద్యుతాఘాతంతో మహిళ మృతి చెందగా, విశాఖ జిల్లా కంచరపాలెంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం అయిన ఘటన చోటు చేసుకుంది.

By

Published : Apr 8, 2022, 2:24 PM IST

Updated : Apr 8, 2022, 4:26 PM IST

Today Crime in AP: గుంటూరు నగర శివారులోని బుడంపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను జీజీహెచ్ శవాగారానికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుతాఘాతంతో మహిళ మృతి:అనకాపల్లి జిల్లా కసింకోటలో ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలి పని చేస్తున్న ఆకుల రామ లక్ష్మి అనే మహిళ విద్యుతాఘతానికి గురై మృతి చెందింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం:సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యమైన ఘటన విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కట్టా సుబ్రహ్మణ్యం ( 37 ) అనే కానిస్టేబుల్ రాత్రి గడుస్తున్న క్వార్టర్స్​కు చేరుకోకపోవడంతో సిఐఎస్ఎఫ్ అధికారులు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి:అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో ఆరవ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ వ్యవసాయ తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. బంధువులు ఆస్తి కోసం బాలుడిని హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు, గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దొంగకు గ్రామస్థుల దేహశుద్ధి:నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం సాల్మన్ పురంలో ఓ దొంగకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. రాత్రి ఓ యువకుడు గ్రామంలోని మూడు ఇళ్లలో దొంగతనాలకు యత్నించాడు. బుచ్చి సీఐ కోటేశ్వరరావు గ్రామానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ మద్యం స్వాధీనం:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టే పాడు గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ చేసి ఉన్నారన్న సమాచారంతో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో హైస్కూల్ సమీపంలోని రెండు ఇళ్లలో అక్రమంగా నిల్వ చేసి ఉన్న 729 కర్ణాటక మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు:ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్​కు చెందిన అజయ్​కుమార్ అనే వ్యక్తికి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా అదనపు జడ్జి తీర్పును వెలువరించినట్లు న్యాయవాది విద్యాపతి తెలిపారు. దీనిపై జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

చీటి పాట కేసులో నలుగురు అరెస్ట్:అన్ని అనుమతులు ఉన్న వారి దగ్గరే చీటి పాటలు వేయాలని లేకపొతే మోసపోయే ప్రమాదం ఉందని బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ అన్నారు. చీటి పాటలు వేసి ప్రజలను మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బినామీలు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

అనకాపల్లిలో గంజాయి స్వాధీనం:అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వాహన తనిఖీల్లో 444 కిలోల గంజాయిని గొలుగొండ సెబ్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యానును స్వాధీన పరచుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తల్లిని హత్య చేసిన కొడుకు:కర్నూలులో దారుణం జరిగింది. తారకరామానగర్​కు చెందిన లక్ష్మీదేవిని ఆమె కుమారుడు రామగిరేంద్ర రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు:

గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యభర్తల గొడవ కారణంగా ఇద్దరు ఆత్నహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన పై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల పరిధిలోని తిమ్మిరెడ్డిపల్లి వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, రిమాండ్​కు తరలించామని సీఐ ఆశీర్వాదం తెలిపారు.

దొంగలను కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు: తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు నలుగురు దొంగలను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చారు. మార్చి ఒకటో తేదీన స్థానిక మల్లాం జాతీయ రహదారి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో నలుగురు వ్యక్తులు చోరీ చేశారు.

నీటి సంపులో పడి బాలుడి మృతి:నీటి సంపులో పడి ఒకటిన్నర సంవత్సరం వయసున్న మహమ్మద్ జైద్ అనే బాలుడు మృతి చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది

ఆటోను ఢీకొన్న లారీ.. పదకొండు మందికి గాయాలు:ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరు మండలం చీమలపాడు అంకమ్మ ఆలయం సమీపంలోని మలుపుల వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

వివాహిత దారుణ హత్య:బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని 28వ వార్డ్​లో అద్దెకు నివసిస్తున్న శివ నాగులు (28) అనే మహిళ దారుణంగా హత్యకు గురైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్​ను ఢీకొన్న టాటా ఏసీ.. ఒకరు మృతి:విశాఖ జిల్లా గాజువాక ఎన్‌ఏడీ-షీలానగర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కంటైనరును టాటా ఏసీ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. విజయకుమార్ అనే క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ నాగదుర్గాప్రసాదుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భవన నిర్మాణ కార్మికుడు దారుణ హత్య:శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు గంగాధర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలాన్ని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పరిశీలించారు. తన భర్త హత్యకు కారణం వడ్డీ వ్యాపారులు అని మృతుని భార్య లక్ష్మి పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రూ.ఆరు లక్షల విలువైన గంజాయి పట్టివేత:అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో రూ.6 లక్షల విలువైన 107 కిలోల గంజాయిని సీఐ శ్రీనివాస రావు పట్టుకున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాలు సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస రావు తెలిపారు.

ఏటీఎంల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న వారి ఫొటోలు నెట్టింట్లో వైరల్:ఏటీఎంల వద్దకు వచ్చే చదువు రాని వారిని లక్ష్యంగా చేసుకుని కార్డులు మార్చుతూ నగదు దొంగిలించిన ఘటన సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై సామాజిక మాధ్యమాల్లో నిందితుల ఫొటోలను వైరల్ చేశారు.

హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు:రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ ఎదురుగా మమత హోటల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో దొంగల హల్‌చల్‌:వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో దొంగలు హల్‌చల్‌ చేశారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీకి యత్నించిన దొంగలు ఇంటి కిటికీలు తెరిచి లోపలికి వెళ్లారు. ఇంటి యజమాని కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు.

పదో తరగతి విద్యార్థి అదృశ్యం:కాకినాడలోని మం.తూరంగిలో పదో తరగతి విద్యార్థి అదృశ్యం అయ్యిన ఘటన కలకలం రేపింది. గౌతమ్‌ కనిపించకుండా పోవడంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: Tension at Kuppam: పార్థసారథి అంత్యక్రియలకు భారీగా నేతలు.. కుప్పంలో ఉద్రిక్తత

Last Updated : Apr 8, 2022, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details