Crime News: విశాఖ జిల్లా గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో ఎస్ఈబీ పోలీసుల నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేశారు.
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన తనయుడు
గుంటూరు జిల్లా నరసరావుపేట రామిరెడ్డిపేట సమీపంలో అస్తి కోసం కొడుకు... కన్న తల్లిని హతమార్చాడు. ఆస్తి వివాదంలో తల్లి శివమ్మను కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడు వెంకట్రావు అక్కడి నుంటి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు... దర్యాప్తు చేపట్టారు
ఆటో ఢీకొని బాలుడు మృతి
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఏ-ముప్పాళ్లలో ఆటో ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. బాలుడు ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో బాలుడిని ఢీకొని తల పైనుంచి దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు.
లారీ ఢీకొని మతిస్థిమితంలేని వ్యక్తి మృతి
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం శుద్ధగొమ్ము గ్రామం వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కాలిబాటన వెళ్తున్న మిట్టపల్లి రమేష్ (30) అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన రమేష్‌కు మతిస్థిమితం సరిగా లేదని.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేసాడని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రంపచోడవరం వైపు నడిచి వెళ్తుండగా.. ఎదురుగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నాటుసారా బట్టీలపై పోలీసుల దాడులు
విశాఖ జిల్లా గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో నాటుసారా తయారీ బట్టీలపై ఎస్ఈబీ పోలీసులు దాడులు నిర్వహించారు. జీడి మామిడి, సరుగుడు తోటల్లో బట్టీలను ఏర్పాటు చేసి గిరిజన గ్రామాలకు సరఫరా చేయడంతో పాటు.. సమీపంలోని మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు చేశారు. 1,999 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
బియ్యం అక్రమంగా తరలిస్తున్న 5 లారీలు సీజ్
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు తీసుకెళ్తున్నట్లు డ్రైవర్లు చెప్పారని తెలిపారు. రెవిన్యూ సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చామని... అవి ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యమా కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు.