Today AP Crime News: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను తూర్పుగోదావరి జిల్లా మలికీపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త:కడప జిల్లా ఒంటిమిట్టలో వివాహితను భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఏడేళ్ల కిందట రేష్మా, ఇస్మాయిల్ అనే ఇద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ కలహాలతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పుట్టింట్లో ఉన్న రేష్మా ఇంటికి వెళ్లి ఇస్మాయిల్ ఆమెతో గొడవపడి వెంట తెచ్చుకున్న టువంటి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు ఇస్మాయిల్ ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రూ.9 లక్షల విలువైన కర్ణాటక మద్యం సీజ్:అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మొరంపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి నుంచి కర్నూలు జిల్లాకు అక్రమ తరలిస్తున్న మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు హిందూపురం రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిలమత్తూరు మండలం జాతీయ రహదారిపై కొడికొండ చెక్‌పోస్టు మొరంపల్లి క్రాస్ వద్ద ఐచర్ వాహనం, కారుల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన 170 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు సెబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ మీడియాకు వివరించారు.
చోరీలకు పాల్పడుతున్న.. ఇద్దురు దొంగలు అరెస్ట్:పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.6.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మలికిపురం పీఎస్ పరిధిలోని దిండిలో గతనెలలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురానికి చెందిన ఇద్దరు నిందితులు పత్తిరి ప్రసాద్, పత్తిరి ఇశ్రాయేలును దిండి చెక్‌పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారించగా పాలకొల్లు, నరసాపురం పీఎస్‌ల పరిధిలో మరో రెండు చోరీలు చేసినట్లు తెలింది. ఈ చోరీలకు సంబంధించి 91 గ్రాములు బంగారు ఆభరణాలు, 11 వందల గ్రాములు వెండి ఆభరణాలు, రూ.90 వేలు నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు మీడియాకు పోలీసులు వెల్లడించారు.