Today AP Crime News: విశాఖ జిల్లా పాయకరావుపేటలో జాతీయ రహదారిపై తల్లి - బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం బోల్తా పడింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రులో అగ్నిప్రమాదం జరిగింది.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి: విశాఖ జిల్లా పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని రుక్మిణి మృతి చెందింది. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థిని చదువుతోందని.. విద్యార్థిని మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని అనారోగ్యంగా ఉన్నా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులో భారీ చోరీ... బంగారం అపహరణ:కడప జిల్లా ప్రొద్దుటూరులో పట్టగలే భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. బంగారం, వెండి నగదు అపహరించారు. ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి, శివజ్యోతి దంపతులు మండలంలోని పశువైద్య కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఉగాది పండుగ కావడంతో తన పిల్లలను తీసుకుని స్వస్థలమైన ఒంగోలుకు సుధాకర్ వెళ్లాడు.
శివజ్యోతి రోజూమారిదిగానే కళాశాలకు వెళ్లి సాయత్రం ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటి గోడ దూకి ఓ వ్యక్తి పారిపోతుండటంతో అతన్ని పట్టుకునేందుకు ఆమె వెంబడించింది. బైపాస్ రోడ్డులో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచిన కారు ఎక్కి పరారయ్యాడు. ఇంటికి వచ్చిన చూడగా బీరువాల్లో ఉంచిన 50 తులాల బంగారం, 500 గ్రాముల వెండి, మరో రూ.1.20 లక్షలు చోరీకి గురైనట్లు శివజ్యోతి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం బోల్తా:గమ్యం చేరకుండానే జాతీయ రహదారిపై తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం బోల్తా పడిన సంఘటన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయి ఒడ్డీమెట్ట గ్రామం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.