Today Crime: అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామం సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద నాగరాజు అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై హత్యాయత్నం:కృష్ణాజిల్లా వీరులపాడు మండలం అల్లూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. అల్లూరు గ్రామానికి చెందిన వివాహితపై యర్రంశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. వీరులపాడు పోలీస్‌స్టేషన్‌కు గ్రామస్థులు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం:గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. ఇంట్లో ఉన్న ఆస్తి పత్రాలు, నాలుగు సవర్ల బంగారం, రూ. 10 వేల నగదు అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
వలస కూలీల ట్రాక్టర్ బోల్తా...ఇద్దరి పరిస్థితి విషమం:అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు:అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పలు గ్రామాలలో సెబ్ ఏఎస్పీ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 2500 లీటర్ల బెల్లంఊట, 60 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశామని సెబ్ ఏఎస్పీ తెలిపారు.
గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం:గుంటూరు జిల్లా బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం వెళ్లే రోడ్డు మార్గంలోని పొలంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమయింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యా? ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి:ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి కలవకూరు వెళ్లే రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరాంజనేయులు గా పోలీసులు గుర్తించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దళారి చేతిలో మోసపోయిన రైతు:ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో రైతును ఓ దళారి మోసం చేశాడు. 3 కోట్ల రూపాయలకు పైగా మిర్చి పంట కొనుగోలు చేసిన అతను రైతుకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. దీనిపై ఆ రైతు పోలీసుల ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల జోక్యంతో దళారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.