TODAY CRIME NEWS in AP: రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదాలు వెలుగుచూశాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు మరణించగా.. ఐదుగురు గాయాలపాలయ్యారు.
బావిలోకి దూసుకెళ్లిన పాల ఆటో.. డ్రైవర్ మృతి
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం వద్ద ప్రమాదవశాత్తు పాల ఆటో బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం ఉదయం స్థానిక వ్యవసాయ బావిలో ఆటో కనిపించడంతో స్థానికులు బయటకు తీశారు. ఆటోలో డ్రైవర్ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు రావిపాడు గ్రామానికి చెందిన బాలగాని అనిల్ కుమార్ (28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కేతముక్కల అగ్రహారం, పరిసర గ్రామాల్లో ఆటో ద్వారా పాలు సేకరించి పట్టణంలోని సంఘం డెయిరీకి సరఫరా చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పాల సేకరణకు ఆయా గ్రామాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో కేతముక్కల అగ్రహారం వద్ద బావిలో పడిందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారని బంధువులు తెలిపారు.
ఆటో-బైకు ఢీకొని ఒకరు మృతి... ఐదుగురికి గాయాలు
కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ - జులకల్ మార్గంలో ఆటో - ద్విచక్ర వాహనం ఢీకొని ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడు పోలకల్ గ్రామానికి చెందిన బోయ సోముడు (16)గా పోలీసులు గుర్తించారు. గూడూరులో ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. తన మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై గూడూరు వెళ్తుండగా పొన్నకల్- జులకల్ గ్రామాల మధ్య ఆటో ఢీకొందని.. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ సోముడు మరణించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Chicken curry Dispute: ప్రాణం తీసిన కోడికూర..మత్తులో చెల్లిని చంపిన అన్న