హిజ్రాగా చేస్తామని లింగ మార్పిడి చేసేందుకు మర్మాంగాన్ని తొలగించడంతో తీవ్ర రక్తస్రావమై ఒక యువకుడు మృతి చెందారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాల బీఫార్మసీ విద్యార్థులు ఈ శస్త్రచికిత్స చేశారు.
తక్కువ ఖర్చుతో చేస్తానని..
పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28)కు పెళ్లయింది. 6నెలలకే భార్య విడిచి వెళ్లింది. నాలుగేళ్ల కిందట శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒంగోలులో ఉండేవారు. అక్కడ ఆయనకు విశాఖకు చెందిన మోనాలిసా అలియాస్ అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆరు నెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎ.మస్తాన్, జీవ పరిచయమయ్యారు. సాన్నిహిత్యం పెరిగాక తాను ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు శ్రీకాంత్ చెప్పారు. అందుకు రూ.లక్షలు ఖర్చవుతుందని, తాను బీఫార్మసీ విద్యార్థినని, శస్త్రచికిత్సపై అవగాహన ఉందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్ హామీనిచ్చారు.