ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దసరా పేలుళ్ల ప్లాన్​ భగ్నం.. హవాలా మార్గంపై దర్యాప్తు.. - దసరా పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్​

Terrorists plan Dussehra blasts in Hyderabad: ఉగ్రకుట్ర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు ఉపయోగించిన చరవాణిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్​లో ఉన్న ఎల్ఈటీ ఉగ్రవాదులతో నిందితులు జరిపిన సంభాషణను డీకోడ్ చేస్తున్నారు. దీనికోసం నిపుణుల సాయం తీసుకుంటున్నారు. హ్యాండ్ గ్రనేడ్లు మనోహరాబాద్​కు ఎలా చేరాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. దసరా పేలుళ్ల కోసం నిందితులకు ఇంకెవరెవరు సాయం చేశారనే కోణంలో సిట్ అధికారుల దర్యాప్తు చేస్తున్నారు.

Terrorists plan Dussehra blasts in Hyderabad
Terrorists plan Dussehra blasts in Hyderabad

By

Published : Oct 7, 2022, 11:10 AM IST

Terrorists plan Dussehra blasts in Hyderabad: చైనాలో తయారైన హ్యాండ్ గ్రనేడ్లు మెదక్ జిల్లా మనోహరాబాద్ కు ఎలా చేరుకున్నాయి. పాక్ ఉగ్రవాదులు కశ్మీర్​లో డ్రోన్ సాయంతో జారవిడిచినా.. అక్కడి నుంచి మనోహరాబాద్ కు ఎలా తరలించారు. ఇందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు. కేవలం 4 హ్యాండ్ గ్రనేడ్లే ఇక్కడికి చేరుకున్నాయా.. లేకపోతే ఇంకా ఎక్కువ మొత్తం ఇతర ప్రాంతాలకు చేరవేశారా అనే కోణంలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబర్ 28న సమీయుద్దీన్ హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ కు ద్విచక్రవాహనంపై వెళ్లి... 4 హ్యాండ్ గ్రనేడ్లను తీసుకొని మరుసటి రోజు నగరానికి చేరుకున్నాడు. మనోహరాబాద్ లో ఎక్కడ గ్రనేడ్లను సమియుద్దీన్ తీసుకున్నాడు... ఆయనకు ఎవరు అప్పగించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

దసరా పేలుళ్ల ప్లాన్​ భగ్నం.. హవాలా మార్గంపై దర్యాప్తు..

ఆధారాలు సేకరణ.. సిట్ పోలీసులు ఇప్పటికే అబ్దుల్ జాహెద్​కు చెందిన 2 చరవాణిలు, సమియుద్దీన్​కు చెందిన ఒక చరవాణి, మాజ్ హసన్ నుంచి రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు .. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఎవరెవరితో మాట్లాడారనే వివరాలను సేకరిస్తున్నారు. జాహెద్ మూడేళ్ల నుంచి పేలుళ్లకు ప్రణాళిక రచిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా పాక్ లో ఉంటున్న లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరితో... సంభాషణలు కొనసాగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దర్యాప్తు అధికారులకు చిక్కకుండా జాహెద్ కోడ్ భాషలో ఫర్హతుల్లా ఘోరితో సంభాషించినట్లు తేల్చారు. సమియుద్దీన్ చరవాణిలో ఉన్న మొబైల్ అప్లికేషన్లలోనూ... నేరుగా ఫర్హతుల్లాతో మాట్లాడినట్లు ఆధారాలు సేకరించారు. కోడ్ భాషను గుర్తించే నిపుణులను సిట్ పోలీసులు సంప్రదించి.. సంభాషణను తేల్చే పనిలో ఉన్నారు.
ఇంత మొత్తంలో ఎవరు డబ్బు అందించారు.. పాక్ నుంచి జాహెద్ కు దాదాపు 33లక్షల రూపాయలు అందినట్లు పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో ఈ డబ్బు జాహెద్​కు చేరినట్లు తేల్చారు. ఫర్హతుల్లా ఘోరి ఈ డబ్బులను పలు మార్గాల్లో అందించినట్లు సిట్ గుర్తించింది. అయితే ఎలా ఈ డబ్బులు జాహెద్​కు చేరాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని యువకులను ఉగ్రవాదంవైపు ఆకర్షించేలా చేయడానికి డబ్బులు ఖర్చు చేసేందుకు ఘోరి డబ్బులను అందించాడు. జాహెద్ ఈ డబ్బు మొత్తాన్ని ఎక్కడ ఖర్చు చేశాడనే వివరాలు సేకరిస్తున్నాడు. జాహెద్ సోదరుడు మాజిద్ సైతం పాక్ లోనే తలదాచుకుంటూ ఫర్హతుల్లా ఘోరికి సహాయకుడిగా పని చేస్తున్నాడు. మాజిద్ ద్వారా కూడా జాహెద్ కు డబ్బులు చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

జైలులోనే పథక రచన.. జాహెద్ స్నేహితులు, తెలిసినవాళ్లపైనా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. జాహెద్, సమియుద్దీన్, మాజ్ హసన్​తో పాటు, ఇంకెవరెవరికీ ఈ కుట్రలో సంబంధం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజ్ హసన్ 4 ఏళ్ల కిందట ఐసిస్ లో చేరాలనే ఉద్దేశంతో సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ జమ్మూకశ్మీర్​లో దొరికిపోయాడు. అక్కడి పోలీసులు రాష్ట్ర పోలీసులకు అప్పజెప్పడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. మెహదీపట్నంలోని హుమాయున్ నగర్​కు చెందిన మాజ్ హసన్ కు, చంచల్ గూడ జైల్లోనే జాహెద్ తో పరిచయం ఏర్పడింది. బయటికి వచ్చిన తర్వాత మాజ్ హసన్ ఎవరెవరితో సంప్రదింపులు జరిపారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం.. వీళ్లు ముగ్గురు కలిసి, పాక్ నుంచి వచ్చిన డబ్బులతో ఎంత మంది యువకులను ఆకర్షించారనే దానిపైనే సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముగ్గురిని అరెస్ట్ చేసే క్రమంలో కౌంటర్ ఇంటిలిజెన్స్, సిట్, టాస్క్ పోర్స్ పోలీసులు పలుచోట్లు తనిఖీలు నిర్వహించి 20మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాళ్లలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే.. మరింత సమాచారం వస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ సైతం దసరా పేలుళ్లకు కుట్ర కేసులో వివరాలు సేకరించింది. అవసరమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే యోచనలో ఎన్ఐఏ అధికారులున్నారు.

ABOUT THE AUTHOR

...view details