Road Accidents Telangana : రాష్ట్రంలో ఏటా సుమారు 20 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడపడమే 20-30 శాతం ప్రమాదాలకు కారణమని అనుమానాలున్నా.. దర్యాప్తులో ఆ విషయం తేలడం లేదు. రాజధాని పరిధిలో 24 గంటల వ్యవధిలో జరిగిన నాలుగు ఘటనలకు డ్రంకెన్ డ్రైవింగ్ కారణం కావడం గమనార్హం. డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారించేందుకు.. తాగిన మోతాదును బట్టి 24 గంటల్లోపు బ్లడ్ ఆల్కహాల్(బీఏసీ) పరీక్ష చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఆల్కహాల్ మోతాదు 30ఎంజీ/100ఎంఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలితే.. కేసు నమోదు చేయాలి. అయితే, డ్రైవర్లు ఘటన స్థలంలో దొరక్కపోతే.. డ్రంకెన్ డ్రైవ్‌గా పోలీసులు నిర్ధారించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. సైబరాబాద్ పోలీసులు చేస్తున్నట్లు.. కొంతమేర శాస్త్రీయతను జోడిస్తే ఆధారాలు సేకరించే అవకాశాలున్నాయి.
సైబరాబాద్‌లో ‘ఆర్‌టీఏఎం’ విశ్లేషణ
Telangana Road accidents 2021 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ‘రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్(ఆర్‌టీఏఎం)’ విభాగం చేసిన శాస్త్రీయ విశ్లేషణలో దాదాపు 35 శాతం ప్రమాదాలకు డ్రంకెన్ డ్రైవింగే కారణమని తేలింది. ‘ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ ఘటనాస్థలిలో దొరక్కపోతే అతడు ప్రయాణించిన మార్గంలో దారిపొడవునా సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నాం. ప్రయాణం మధ్యలో మద్యం కొన్నట్లు గాని, తాగినట్లు గాని కనబడితే.. స్థానిక పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాం. కేసులో 304(బీ) సెక్షన్ జోడించి అభియోగపత్రం దాఖలు చేసేలా చూస్తున్నాం. ఫలితంగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులను నిరూపించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది’ అని ట్రాఫిక్ డీసీపీ ఎస్.ఎం.విజయ్‌కుమార్ పేర్కొన్నారు.