అనూహ్యంగా పెరిగిపోతున్న సైబర్ నేరాల(Cyber Crimes)కు కళ్లెం వేసేందుకు పోలీసుశాఖ మూడంచెల వ్యూహం అమలు చేస్తోంది. తద్వారా మున్ముందు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను అదుపులోకి తేవాలని యోచిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఎక్కడెక్కడో దాగిన నేరగాళ్ల గుట్టు రట్టు చేసేందుకు ఆయా రాష్ట్రాలతో సమన్వయం నెరపుతోంది. పట్టుబడతామన్న భయం కల్పించడం ద్వారా నేరగాళ్లకు పగ్గాలు వేయడంతో పాటు నేరాలనూ నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు.
Cyber Crimes: మూడంచెల వ్యూహంతో సైబర్ కేటుగాళ్ల ఆగడాలకు కళ్లెం - telangana police plan to control cyber crimes
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ కేటుగాళ్ల ఆగడాలకు తెలంగాణ పోలీసులు అడ్డుకట్ట వేయనున్నారు. నేరగాళ్ల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. వారి ఆకృత్యాలను కట్టడి చేస్తున్న పోలీసులు.. వారి గుండెల్లో గుబులు పుట్టించేలా మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నారు. నేరం(Cyber Crimes) చేస్తే శిక్ష తప్పదన్న భయం వారిలో పుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారు.
telangana-police
ఏడు నెలల్లోనే 4000 నేరాలు!
- గత ఏడాది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4,500కి పైగా సైబర్ నేరాలు(Cyber Crimes)నమోదు కాగా.. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లోనే ఈ సంఖ్య ఏకంగా 4,000 దాటిపోయింది. ముఖ్యంగా గత రెండు, మూడు నెలలుగా కొత్త పద్ధతుల్లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. రాబోయే రోజుల్లో నెలకు సగటున వెయ్యికిపైగా సైబర్ నేరాలు నమోదుకావచ్చని అంచనా వేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని అధికారులూ ఆందోళన చెందుతున్నారు. అందుకే సైబర్ నేరాల నిరోధానికి మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నారు.
- తొలుత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి ఒకరిద్దరు సిబ్బందిని ఎంపిక చేసి సైబర్ నేరాల దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి సైబర్ వారియర్లు అని పేరు పెట్టారు. ఇప్పటికే మొత్తం 1988 మంది శిక్షణ పూర్తిచేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఇంకొందరిని సైతం తర్ఫీదు చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
- ఒకప్పుడు హైదరాబాద్‌లో మాత్రమే సైబర్ పోలీస్‌స్టేషన్ ఉండేది. తర్వాతి కాలంలో జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని పోలీస్‌స్టేషన్ స్థాయికి విస్తరించారు. సైబర్ నేరాలను ఎక్కడికక్కడే నమోదు చేయాలని ఇప్పటికే పోలీస్‌స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. తద్వారా దర్యాప్తు అధికారులపై కేసుల ఒత్తిడి తగ్గించాలని భావిస్తున్నారు.
- అసలు సైబర్ నేరగాళ్ల(Cyber Crimes)బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించబోతున్నారు. బహుమతి వచ్చింది, డబ్బు కట్టి విడిపించుకోమని ఆశచూపుతూ దోచుకుంటున్న నేరాలెన్ని జరుగుతున్నా ప్రజలు వీటి బారిన పడుతూనే ఉన్నారు. అందుకే ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. సైబర్ నేరగాళ్లు రాజస్థాన్, ఝార్ఖండ్, దిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి చోట్ల నుంచి నేరాలకు పాల్పడుతున్నారు. వీరి ఆచూకీ గుర్తించినా పట్టుకొని రాష్ట్రానికి తేవాలంటే అక్కడి పోలీసుల సహకారం అవసరం. కాని చాలా సందర్భాల్లో వారు సహకరించడంలేదు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో సమన్వయం నెరపేందుకు ప్రత్యేకంగా ఐజీ రాజేష్‌కుమార్‌ను నియమించారు.