తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్కు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె కూస త్రిష.. ఇటీవల పదో తరగతి పాస్ అయింది.
ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని.. సెల్ఫోన్ కొనివ్వాలని త్రిష తండ్రిని కోరింది. ఇప్పుడు డబ్బులు లేవు.. కొద్దిరోజులు ఆగాలని సంపత్ చెప్పగా తీవ్ర మనస్థాపానికి గురైంది. తండ్రిని అర్థం చేసుకోకుండా.. క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నర్సంపేట ప్రాంతీయ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రిష మృతి చెందింది. తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.