తెలంగాణలో సంచలనం రేకెత్తించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును అరెస్టు చేసినట్లు ఉత్తర మండల ఐజీ నాగిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు పెద్దపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్ మేనల్లుడు పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.
ప్రాణ స్నేహితులు...
కుంట శ్రీను, బిట్టు శ్రీను ఇద్దరు ప్రాణ స్నేహితులని ఐజీ పేర్కొన్నారు. కుంట శ్రీను ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వామన్రావు కోర్టులో అనేక కేసులు వేసినట్లు చెప్పాడని ఆయన తెలిపారు. పుట్ట లింగమ్మ ట్రస్టుకు సంబంధించిన వ్యవహారాల్లోనూ తలదూర్చడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేపట్టే ట్రస్టుపై ఆరోపణలు చేసేవాడని సామాజిక మాధ్యమాల్లో అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టినట్లు ఆయన చెప్పారు. వామన్రావు చర్యల గురించి బిట్టు శ్రీను, కుంట శ్రీనివాస్ పలు సందర్బాల్లో చర్చించుకున్నారని అతన్ని చంపకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పుకున్నట్లు ఐజీ పేర్కొన్నారు.