చీటీ పాటల పేరుతో ఓ మహిళ పలువురిని నట్టేట ముంచారు. సుమారు రూ.5.60 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం జిల్లా చినగంజాం మండలం సోపిరాలకు చెందిన పోలకం ఝాన్సీలక్ష్మి, వెంకటస్వామి దంపతులు. వెంకటస్వామి మిలటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఝాన్సీలక్ష్మి సుమారు 25 ఏళ్లుగా సోపిరాలలో ఉంటూ చీటీ పాటలు నిర్వహిస్తూ అందరికీ నమ్మకం కలిగించారు.
పట్టణాల్లో విలువైన భవనాలు, స్థలాల కొనుగోలు..
చీటీ పాటలు వేస్తున్న వారితో పాటు ఇతరుల నుంచి రూ. లక్ష, రూ.2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల చొప్పున అప్పుగా తీసుకున్నారు. ఇలా సుమారు రూ.5.60 కోట్ల వరకు పాటదారులు, అప్పులిచ్చిన వారికి చెల్లించాల్సి ఉంది. కొన్నినెలలుగా బాకీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలోనే తాను ఉండే ఇంటిని ఝాన్సీలక్ష్మి ఇటీవల విక్రయించారు. అదే సమయంలో హైదరాబాద్, చీరాల తదితర పట్టణాల్లో విలువైన భవనాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే చీటీ పాటలు పాడిన వారికి డబ్బులు చెల్లించకపోవడం, అప్పులు తీసుకున్నవారికి ఇవ్వకుండా తిప్పుకొంటున్నారు.