తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసగుప్ప వద్ద ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిలో ఒక బాలుడు(17) ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పూసగుప్ప వద్ద.. పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోతున్న ఆరుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ జి. వినీత్ తెలిపారు.
ఈ ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని.. రెండు మూడేళ్లుగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. వీరు పోలీసులను హతమార్చేందుకు ప్రయత్నాలే గాక, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లోనూ పాల్గొన్నట్లు వెల్లడించారు. ఐదుగురిని రిమాండ్‌కు తరలించగా.. మైనర్ బాలుడిని జువైనల్ హోంకి తరలించినట్లు వివరించారు.