తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ సింగిల్ విండో ఛైర్మన్.. రహదారిపై వెళ్తున్న ఓ సీడ్ కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. ప్రతి టాక్టర్‌కు రూ.లక్ష మామూళ్లను ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ డిమాండ్ చేశారు. వారిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆలస్యంగా వెలుగులోకి..
కేశవపట్నం మండలంలోని సదరు సీడ్ కంపెనీ విత్తనాలను.. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గోదాంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మొగిలిపాలెం సమీపంలోకి వచ్చిన వాహనాలను.. ఛైర్మన్, మరో డైరెక్టర్‌తో కలిసి అడ్డుకున్నారు. డబ్బు డిమాండ్ చేస్తూ వారితో గొడవకు దిగారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వారిపై కూడా ఛైర్మన్ దాడి చేసినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన ఐదు రోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది.