విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించిన సఖినేటిపల్లి మహిళా ఎస్‌ఐ కె.భవాని వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆమె గదిలో, ఫోన్‌లో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. పీటీసీలో ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో మాత్రం ‘ఈ రోజు చనిపోతున్నా’ అని రాసి ఉందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.
ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ...
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్‌ఐ కె.భవాని (27) నేర విశ్లేషణ (సీడీ) శిక్షణ కోసం 5 రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. నగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలోని (పీటీసీ) క్వార్టర్స్‌లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం శిక్షణ ముగియడంతో తన గదికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన పనివారు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరచి చూశారు. భవాని ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో...వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ దీపిక ఎం.పాటిల్, డీఎస్పీ పి.అనిల్ కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.