'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(justice sirpurkar commission) విచారణ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఫరూఖ్ నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను కమిషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత క్లూస్ టీం అధికారి వెంకన్నను ప్రశ్నించనున్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ, సైబరాబాద్ అప్పటి సీపీ సజ్జనార్‌ను విచారించనున్నారు. ఆయన ఇప్పటికే కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఆర్ఐతో పాటు క్లూస్ టీం అధికారి వెంకన్న విచారణ ముగిసిన తర్వాత కమిషన్ సభ్యులు.. సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉంది. కమిషన్ సభ్యులు ఇప్పటికే హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డితో పాటు పోస్టుమార్టం నిర్వహించిన దిల్లీ ఎయిమ్స్, గాంధీ ఆస్పత్రి వైద్యులను విచారించారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేశారు.
సీపీ మహేష్ భగవత్‌పై ప్రశ్నల వర్షం
దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణలో భాగంగా సిట్.. దర్యాప్తు అధికారిగా ఉన్న రాచకొండ సీపీ మహేష్ భగవత్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్(Disha encounter).. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగినందున అప్పటి కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ఎందుకు విచారించలేదని భగవత్‌ను కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు మహేష్ భగవత్ సమాధానమివ్వగా... కొన్నింటికి జవాబు చెప్పలేకపోయారు. ఎదురుకాల్పుల సమయంలో గాయపడ్డ ఇద్దరు పోలీసులకు సంబంధించి చికిత్స వివరాలను సిట్ నివేదికలో ఎందుకు పొందుపర్చలేదని కమిషన్ ప్రశ్నించింది.