SI Suspend: తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం జిల్లా రెబ్బెన ఎస్సై భవానీసేన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడంతో మంగళవారం చర్యలు తీసుకున్నట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ రోజు ఎస్సై భవానీసేన్‌ను సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.. పేద కుటుంబానికి చెందిన బాధిత యువతి కష్టపడి ఇంటర్ వరకు చదివింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి ఇల్లు వదిలి వెళ్లగా.. కుటుంబ పోషణ కోసం ప్రైవేటుగా చిన్నపాటి ఉద్యోగాలు చేస్తోంది. పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.
స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి.. సాయం చేస్తారనే ఆశతో స్టేషన్‌కి వెళ్లి అవసరమైన పుస్తకాలు ఇప్పించాలని కోరింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఎస్సై ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత యువతి మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో బంధువులతో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఎస్సై భవానీసేన్ గౌడ్‌పై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు. అంతకుముందు ఆసిఫాబాద్ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని రాజీ చర్చలు జరిగాయి.