ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Telangana LAND: రూ.12 కోట్లకుపైగా విలువైన అసైన్డ్​ భూమిపై మాయగాళ్ల కన్ను - telangana news

తెలంగాణ వ్యాప్తంగా అసైన్డ్​ భూముల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో భూములకు రెక్కలు రావటంతో స్థిరాస్తి వ్యాపారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం నగరానికి ఆనుకుని ప్రధాన రహదారి పక్కనే ఉన్న అసైన్డ్​ భూమిని కబ్జా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏకంగా రూ.12 కోట్ల ధర పలుకుతుండటంతో దస్త్రాలు సృష్టించటంతో పాటు ప్లాట్లుగా మార్చేందుకు చదును చేశారు. కన్వర్షన్‌ వస్తుందంటూ విక్రయించేందుకు పథకం వేశారు.

Telangana  assigned land issue
Telangana assigned land issue

By

Published : Jul 2, 2021, 9:39 AM IST

తెలంగాణ ఖమ్మం నగరంలో బైపాస్‌ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 3 ఎకరాల అసైన్డు భూమికి సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పెద్దతండా పంచాయతీ ఏదులాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 142లో 2.36 ఎకరాల అసైన్డు భూమి ఉంది. దీనికి సంబంధించి 1970లో నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. సుమారు 20 ఏళ్లుగా సదరు భూమిలో ఎలాంటి సాగు చేయకపోవడంతో ఖాళీగా ఉంది. ఇటీవలే పట్టా కలిగిన వ్యక్తి చనిపోగా.. కోట్ల విలువ చేస్తున్న భూమిపై కొంతమంది నేతలు, వ్యాపారుల కన్ను పడింది.

ఏకంగా సీఎం కార్యాలయానికే..

ఆ భూమిని 2017లో ఓ వ్యక్తి కొనుగోలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మరో ఇద్దరు చేతులు మారినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నగరం చుట్టూ భూములకు రెక్కలు రావడంతో కొంతమంది వ్యాపారానికి తెరలేపారు. కన్వర్షన్ కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. అసైన్డు భూమి కావడంతో కన్వర్షన్ చేయకుండా అధికారులు తిరస్కరించారు. చనిపోయిన వ్యక్తి భార్య తన పేరిట పట్టా ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. మరో మహిళ భూమిని కొనుగోలు చేశానని.. తన పేరుపై బదిలీ చేయాలని కోరుతూ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే దరఖాస్తు చేయటం వివాదస్పదమైంది.

కోట్లు దండుకునేందుకు..

అసైన్డు భూమిలో అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధమని తెలిసినా.. కొంతమంది తమ పలుకుబడి ఉపయోగించి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అడ్డదారుల్లో దస్త్రాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే కన్వర్షన్‌ వస్తుందంటూ ప్రచారం చేసి ప్లాట్లుగా మలిచి కోట్లు దండుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. దశాబ్దాలపాటు పడావుగా ఉన్న భూమితో పాటు పక్కనే ఉన్న చిన్న గుట్టను తవ్వి 3 ఎకరాల్లో చదును చేశారు. అయితే... అసైన్డు భూముల్లో అమ్మకాలు, కొనుగోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.

రూ.12కోట్లపైనే..

ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ అసైన్డు భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరం 4 కోట్ల పైచిలుకు పలుకుతోంది. సుమారు 3 ఎకరాలు ఉండగా... భూమి విలువ 12 కోట్లపైనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. భూమి విలువ భారీగా ఉండటంతో ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో పలువురు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమి అసైన్డు కావడంతో తమకు ప్లాట్ల కోసం కేటాయించాలని స్థానిక ఎస్సీ ఎస్టీలు డిమాండ్ చేస్తున్నారు. మరి కోట్ల విలువైన అసైన్డు భూమిని కాపాడేందుకు జిల్లా అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.

ఇదీ చదవండి:

ANANDAYYA: 'సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడకూడదు'

ABOUT THE AUTHOR

...view details