తన రహస్యాన్ని అందరికీ చెప్పేస్తామని బెదిరించి.. ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ మహిల ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్మాయిల్ అనే వ్యక్తితో పాటు మరో బాలుడు అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ వెల్లడించింది.
ఎలా వెలుగులోకి వచ్చిందంటే..
ఈ నెల 15న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలో సదరు మహిళ మరో యువకుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వైద్యులు చికిత్స అందించి వారి ప్రాణాలను రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వీరు ఇరువురు హైదరాబాద్‌లో ఒకే సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చికిత్స తర్వాత బాధిత మహిళ, యువకుడు కోలుకోగా పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహిళపై ఇద్దరు అత్యాచారం..
బాధిత మహిళకు బోరబండకు చెందిన యువకుడితో గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఇస్మాయిల్‌తోపాటు మరో బాలుడు సదరు మహిళను బ్లాక్మెయిల్ చేశారు. ఈ విషయం బయటపెడతామని బెదిరించి వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. పదేపదే బెదిరిస్తుండడంతో వివాహిత విసిగిపోయింది. తమ వద్ద వీడియోలు ఉన్నాయని భయపెట్టడంతో.. వికారాబాద్ జిల్లా కండ్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి వివాహితతోపాటు సదరు యువకుడు సైతం పురుగుల మందు తాగారు.