తెలంగాణ ఖమ్మం జిల్లా వైరాలో ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్‌కు చెందిన దినేశ్ సింగ్, ఇన్సాఫ్ మహమ్మద్ నిందితులను గుర్తించగా... వైరాలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న దయాలాల్కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తెలిపారు.
'వైరా పట్టణం ద్వారకా నగర్‌లోని ఎలక్ట్రికల్ షాపు యజమాని దళపతి సింగ్. ఈ నెల 26 రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆయన్ను కొట్టి.. కట్టిపడేశారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పరారయ్యారు. నిందితులు అదేరోజు ఆటోలో నందిగామ వస్తుండగా జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షల 79వేలు ఉంటుంది'.-నాగేశ్వర్ రెడ్డి, నందిగామ డీఎస్పీ.