తెలంగాణోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఏపీలోని కడప ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా 38 చోరీలకు పాల్పడిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. మేడిపల్లి పరిధిలో రెండు రోజుల్లో నాలుగు గొలుసు దొంగతనాలు జరిగాయన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముఠాను పట్టుకున్నామని సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 226 గ్రాముల బంగారం, రూ. 1.75 లక్షలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నామని మహేశ్ భగవత్ తెలిపారు.
'ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి సయిద్ భాషా.. మిగిలిన వారిలో ఒకరు బైక్ రైడర్, మరొకరు క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. వీరందరూ ఏపీలోని కడపకు చెందినవారు. ఓ కారులో కడప నుంచి హైదరాబాద్ వస్తారు. తొలుత ఓ బైక్ను దొంగతనం చేస్తారు. దానిపైన తిరిగి.. చోరీ చేస్తారు. అనంతరం బైక్ను అక్కడే వదిలేసి.. వచ్చిన కారులోనే హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లిపోతారు.' - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ