ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Drug Mafia in Hyderabad: సూత్రధారుల ఆచూకీ ఎక్కడ!.. మత్తుమాఫియా ‘కీ’లక వ్యక్తుల కోసం వేట - ts news

Drug Mafia in Hyderabad: హైదరాబాద్‌లో మత్తుపదార్థాల కట్టడి లక్ష్యంగా పోలీసులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్నవారి జాబితా సిద్ధం చేసిన పోలీసులు సూత్రధారులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల సహకారంతోపాటు సాంకేతికతను వినియోగిస్తున్నారు. మరోవైపు మత్తు మాఫియాపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Drug Mafia in Hyderabad
మత్తుమాఫియా ‘కీ’లక వ్యక్తుల కోసం వేట

By

Published : Apr 9, 2022, 11:42 AM IST

మత్తుమాఫియా ‘కీ’లక వ్యక్తుల కోసం వేట
Drug Mafia in Hyderabad: మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మూలాలను నాశనం చేయకుండా ఆపడం అసాధ్యమని భావించిన పోలీసులు.. హైదరాబాద్‌లో మత్తుపదార్థాలు వినియోగిస్తున్న వారి జాబితా సిద్ధం చేశారు. ఎవరి ద్వారా సరుకు చేరుతుందో తెలుసుకోవడంతోపాటు ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లు, కొరియర్స్ వివరాలు రాబడుతున్నారు. విదేశాల నుంచి రవాణా మార్గాలు, లావాదేవీలు, తెరవెనుక నడిపిస్తున్న సూత్రధారుల గుట్టు బయటపెట్టేందుకు పొరుగు రాష్ట్రాల సహకారం, సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా రాష్ట్రాలతో ఇక్కడి లింకులను చేధించే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలుగా సూత్రధారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారని తెలుస్తోంది.

నగరమే ప్రధాన కేంద్రమా!: విదేశాలతో హైదరాబాద్‌కు ఉన్న సంబంధాలు, రవాణా సౌకర్యాలను డ్రగ్స్‌ మాఫియా అనుకూలంగా వాడుకుంటోంది. కొవిడ్‌ ఆంక్షలతో రెండేళ్లపాటు వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో డ్రగ్స్‌ ముఠాల వద్ద నిల్వ ఉన్న సరుకును బయటకు తరలించటం సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఆంక్షలు తొలగడంతో గోదాముల్లో ఉన్న గంజాయి, హెరాయిన్, కొకైన్‌ను మరో ప్రాంతంలో భద్రపరచి అక్కడి నుంచి ఏజెంట్లకు పంపాలనేది మాఫియా ప్రణాళిక. ఇందులో భాగంగానే... హైదరాబాద్‌ శివారులోని మూతబడిన పరిశ్రమలు, పాత భవనాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు, క్యాబ్‌ డ్రైవర్లకు డబ్బు ఆశ చూపి సరఫరాకు ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ఈ లింకులను బ్రేక్‌ చేయటం ద్వారా మత్తుపదార్థాల రవాణా అరికట్టవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరా మహిళా స్మగ్లర్‌?:మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్, వికాస్‌జాదవ్, నౌషద్‌.. ఒడిశాకు చెందిన దశరథ్‌, సంతోష్‌, సుభాష్‌ గంజాయిని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు చేరవేసే కీలక సూత్రధారులు. లక్ష్మీపతి, నగేష్, మోహన్‌రెడ్డి వంటి విక్రేతలు.. కొద్దిమొత్తంలో గంజాయి, హాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇప్పటివరకూ విక్రేతలు మాత్రమే అరెస్టవుతుండగా సూత్రధారులు ఎక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారనేది పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఇటీవల హైదరాబాద్, రాచకొండ పోలీసులు ముగ్గురు సూత్రధారులను అరెస్ట్‌ చేశారు. హెరాయిన్, కొకైన్, ఎల్​ఎస్​డీ వంటి పార్టీ డ్రగ్స్‌ అధికశాతం దిల్లీలో ఉన్న నైజీరియన్ల ద్వారా హైదరాబాద్‌కు చేరుతున్నట్లు అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. టోలిచౌకి, గోల్కొండ, బండ్లగూడ జాగీరులో మకాం వేసిన నైజీరియన్లకు డార్క్‌నెట్, కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ చేరుతున్నట్టు గుర్తించారు. ముంబయిలోని మహిళా స్మగ్లర్‌ ద్వారా హైదరాబాద్‌లోకి డ్రగ్స్‌ భారీగా చేరుతున్నాయని ఇటీవల అరెస్టయిన నిందితుడి ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో నగరశివారుల్లో జరిగిన రేవ్‌పార్టీల్లోనూ ఆమె పాల్గొన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details