ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

‘నా భర్తను చంపేయ్‌.. సంతోషంగా ఉందాం’ - పండ్ల వ్యాపారి హత్య వార్తలు

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య తన ప్రియుడితో చంపించినట్లు తేల్చారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

Police solved the case of murder of a fruit seller in Shankarpally rangareddy district
నా భర్తను చంపేయ్‌.. సంతోషంగా ఉందాం

By

Published : Jul 17, 2022, 1:08 PM IST

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఈ నెల 11న జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసును శంకర్‌పల్లి పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే.. భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు. శంకర్‌పల్లి ఠాణాలో శనివారం చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మహేశ్​గౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకున్నాడు. అక్కడికి వారానికోసారి వచ్చి వెళ్తుండేవాడు.

బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్‌(వ్యాయామ శాల) ట్రైనర్‌ తిరుపతిరావు(25)తో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అతడిని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని జయసుధ తిరుపతిరావుకి చెప్పింది. అనంతరం శంకరయ్య హత్యకు కుట్ర పన్నారు. ఈ నెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని.. చంపాలని ప్రియుడుకి చెప్పింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా.. టంగటూర్‌ గ్రామ శివారులో తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా శుక్రవారం గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామం. హత్య కేసును వేగంగా ఛేదించిన సీఐ, ఎస్సైలతో పాటు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details