POLICE SOLVED BOY KIDNAP CASE : చిన్నపిల్లలను అపహరించి అమ్మే వారిని గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జీజీహెచ్ లో రెండు రోజుల క్రితం వర్షిద్ అనే ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ టీవీ దృశ్యాల ద్వారా ఓ మహిళ బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. గత నెల 23న అరండల్ పేటలో జరిగిన ప్రకాష్ అనే బాలుడిని కిడ్నాప్ కేసులో నిందితురాలు, ఈమె ఒకరేనని పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు బస్టాండులోని సీసీ కెమెరాల ద్వారా ఆమె ఎక్కిన బస్సును గుర్తించి.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సమీపంలోని కనకాపురంలో పిల్లల్ని గుర్తించి రక్షించారు.
ఇద్దరు పిల్లల్ని కూడా నిందితుల సమీప బంధువులే కొని పెంచుకుంటున్నారు. పిల్లల్ని అపహరించిన తమ్మిశెట్టి నాగమ్మ.. సంతానం లేని వారికి అమ్మింది. ఈ వ్యవహారంలో నాగరాజు అనే వ్యక్తి నాగమ్మకు సహకరించేవాడు. ఈ కేసులో నాగమ్మ, నాగరాజుతో పాటు పిల్లలను కొన్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. జీజీహెచ్ లో భద్రతా సిబ్బంది లోపాలని సమీక్షిస్తామని.. అక్కడి అధికారులకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ తెలిపారు.
పోలీసులు తమ పిల్లల్ని రక్షించి అప్పగించటంతో ప్రకాష్, వర్షిత్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వీరిలో నాలుగేళ్ల ప్రకాష్ తల్లి పోలమ్మ పరిస్థితి మరీ దయనీయం. గత నెల 23నుంచి తమ బాబు కనిపించలేదని.. 26వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సీసీ టీవీ దృశ్యాలు చూసే వరకూ తమ బాబు కిడ్నాపైన విషయం కూడా తెలియదన్నారు. ఇప్పుడు నెల రోజుల కావటంతో ప్రకాష్ తల్లిని మర్చిపోయాడు. కొని పెంచుకుంటున్న వారే తమ తల్లిదండ్రులని భావించాడు. తల్లి వద్దకు వచ్చేందుకు కూడా నిరాకరించాడు. బాలుడిని మధ్యాహ్నం వరకూ నిందితుల వద్దే ఉంచాల్సి వచ్చింది. జీజీహెచ్‌లో కిడ్నాపైన వర్షిద్ తల్లి రెండు రోజులుగా ఆహారం కూడా తీసుకోకుండా బిడ్డ కోసం ఎదురుచూసింది. ఇప్పుడు కుమారుడు రావటంతో ఆమె పోలీసులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.