ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కోనసీమలో కాల్పుల కలకలం.. దర్యాప్తు వేగవంతం - కోనసీమలో కాల్పుల కలకలం

GUN FIRING CASE UPDATES : కోనసీమలో జరిగిన కాల్పుల ఘటనలో దుండగులు వదిలిపెట్టిన నాటు బాంబులు, తుపాకీలు, జామర్​, మొదలగువాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులను నీటిలో నానబెట్టి.. భూమిలో పాతిపెట్టారు. మిగిలిన సామగ్రిపై ఉన్న వేలిముద్రలను తీసుకుని సీజ్ చేశారు. ఆర్థిక లావాదేవీలా, లేక వ్యాపారాల్లో ఏమైనా గొడవలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

GUN FIRE CASE IN KONASEEMA
GUN FIRE CASE IN KONASEEMA

By

Published : Sep 5, 2022, 5:50 PM IST

GUN FIRE CASE IN KONASEEMA : అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్యరెడ్డిపై దాడి చేసి.. కాల్పులు జరిపిన ఘటనలో దుండగులు విడిచిపెట్టిన నాటు బాంబులు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బృందాలు ఆదిత్యరెడ్డి ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. దుండగులు విడిచిపెట్టిన బ్యాగు లోపల నాలుగు నాటు బాంబులు, ఒక జామర్, రెండు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు, లాఫింగ్ గ్యాస్​, ఆరు బులెట్లు, మ్యాగ్​జైన్​లో ఐదు బులెట్లు, మూడు ఖాళీ సిరంజీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నాటు బాంబులను నీటిలో నానబెట్టి నిర్వీర్యం చేసి భూమిలో పాతిపెట్టారు. మిగిలిన సామగ్రిపై ఉన్న వేలిముద్రలను తీసుకుని సీజ్ చేశారు. కాకినాడ నుంచి డాగ్​స్క్వాడ్​ను తీసుకుని రాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో డాగ్ తిరిగింది. ఆదిత్యరెడ్డి తండ్రి సత్యనారాయణరెడ్డి ఫైనాన్స్ వ్యాపారి. ఆయన కోట్లాది రూపాయిల వడ్డీకి ఇస్తుంటారు. సత్యనారాయణరెడ్డి మూడు నెలల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పు వసూలు చేయడానికి జనవరి నెలలో మారేడిమిల్లి వెళ్లిన సమయంలో అక్కడ కొంతమందితో గొడవపడినట్లు.. వాళ్లపైనే అనుమానం ఉందని ఆదిత్యరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలా, లేక వ్యాపారాల్లో ఏమైనా గొడవలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది: కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. రవాణాశాఖ కార్యాలయం వద్ద ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణరెడ్డికి చెందిన భవంతి పైకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారిని సత్యనారాయణ రెడ్డి చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ప్రశ్నించేలోపే కాల్చేందుకు ప్రయత్నించారని.. దీంతో తీవ్ర పెనుగులాట జరిగిందని ఆదిత్యరెడ్డి చెప్పారు. దీంతో తుపాకీ ఒకసారి గాల్లోకి పేలింది. తుపాకీలోని బుల్లెట్లు ఉండే మేగజైన్ కింద పడిపోయింది. ఈ ఘర్షణలో ఇద్దరు దుండగులకు, ఆదిత్యరెడ్డికి గాయాలయ్యాయి. దీనికంతటికీ ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details