Shilpa Chowdary Cheating Case: శిల్ప కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు రోజుల పాటు కస్టడీలో ఆమెను విచారించి సేకరించి వివిధ అంశాల ఆధారంగా కొంతమందిని నేడు విచారించనున్నారు. భూముల కొనుగోలు, ఆసుపత్రి నిర్మాణానికి శిల్ప వద్ద డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్న ఇద్దరిని కూడా విచారణకు హాజరుకావాలని తాఖీదులు అందజేశారు. వారిలో రాధిక అనే ఈవెంట్ మేనేజర్ పోలీసులను కలిసి వివరణ ఇచ్చినట్టు సమాచారం. దీంతో పాటు మరోసారి శిల్పను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే..
శిల్ప పక్కా ప్రణాళిక ప్రకారమే అధిక వడ్డీలు ఆశ చూపి పలువురి వద్ద నుంచి డబ్బులు కొల్లగొట్టినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రియదర్శిని వద్ద నుంచి తీసుకున్న 2.90 కోట్ల రూపాయలకు శిల్ప చెల్లని చెక్కులు, నకిలీ బంగారు ఆభరణాలను ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించిన సమయంలో అందుకు సంబంధించిన ఖాతా గతంలోనే రద్దయినట్టు బయటపడింది. అప్పుడు తాను మోసపోయినట్టు గ్రహించానని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారేటప్పుడు ఆదాయపు పన్ను శాఖ గుర్తించే ఆస్కారం ఉంది. ఈ కేసులో మాత్రం బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో శిల్ప చెప్పినట్టు ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ చేపట్టారు. ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారనే విషయంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. విచారణకు హాజరయ్యే వారి నుంచి సేకరించిన వివరాల ద్వారా మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.