ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై విజయగరంజిల్లా డెంకాడ, భోగాపురం పరిధిలో కత్తితో బెదిరించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 చరవాణీలు, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ వెల్లడించారు. గత కొద్ది రోజులుగా జాతీయ రహదారి పక్కన పార్క్ చేసి నిద్రిస్తున్న లారీలు, ట్రక్కు డ్రైవర్లను కత్తితో బెదిరించి కొందరు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని డీఎస్పీ చెప్పారు.
దోపిడీలన్నీ ఒకే తరహాలో చోటు చేసుకోవటంతో.. పోలీసులు మప్టీలో రెక్కీ నిర్వహించారు. దీంతో పోలీసులకు ఈ ముఠా పట్టుబడిందన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రాత్రి సమయాల్లో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనదారులు, ఒంటరిగా ద్విచక్ర వాహనాల్లో పయనిస్తున్న వారి కత్తితో బెదిరించి నగదు, చరవాణీల దోపిడీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. విజయనగరం బాబామెట్టకు చెందిన షేక్ కాలిషా, డెంకాడ మండలానికి చెందిన తాలడ శివ అనే ఇద్దరు నిందితులతో పాటు.. మరో ఇద్దరు మైనర్స్ని అరెస్టు చేశామన్నారు.