YCP ACTIVISTS ARREST IN MURDER CASE : కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంభళానూరు గ్రామంలో ఈనెల 7వ తేదీన బీజేపీ నాయకుడు ఈడిగ శివ కుమార్ గౌడ్ హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని కల్లు దుకాణం దగ్గర శివకుమార్ కళ్లలో అతి కిరాతకంగా కారం పోసి, వేటకొడవళ్లతో వైసీపీ వర్గీయులు హతమార్చారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురు వైసీపీ వర్గీయులను అదుపులో తీసుకున్నారు. శివ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రామన్న గౌడ్, అతనితో పాటు మరో నలుగురుని అదుపులో తీసుకున్నామని డీఎస్పీ వినోద్ తెలిపారు.
ఇదీ జరిగింది: కుంభలనూరుకు చెందిన బీజేపీ నాయకుడు ఈడిగ శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. కుంభళనూరు గ్రామంలోని ఓ కల్లు దుకాణం దగ్గర గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి, వేట కొడవళ్లతో తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తలకు తీవ్రగాయాలు కావడంతో ఈడిగ శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.