Lottery: సిక్కోలు గడ్డపై నయామోసం వెలుగులోకి వచ్చింది.. ఇప్పటివరకూ పక్క రాష్ట్రాలకే పరిమితమైన ‘లాటరీ టిక్కెట్ల’ సంస్కృతి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి పాకింది.. అంతేగాక నకిలీ టిక్కెట్ల పేరుతో విక్రయదారులు అమాయక ప్రజలను మోసగిస్తూ దోచుకుంటున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్లు, కృష్ణా పార్క్, డే అండ్‌నైట్ కూడళ్లలో పాన్‌షాప్‌ల ముసుగులో రూ.కోట్ల వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతున్నా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదు నేపథ్యంలో స్థానిక పోలీసులకు చెప్పకుండా వేర్వేరుచోట్ల నుంచి వచ్చిన అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది దుకాణాలపై దాడులు చేసి 16 మంది దుకాణదారులతో పాటు, టిక్కెట్లు కొనుగోలు చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జరుగుతోంది ఇది..:అరుణాచలప్రదేశ్ రాష్ట్రం పేరుతో నకిలీ లాటరీ టిక్కెట్లు తయారు చేసి ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అరుణాచల లక్ష్మి, అరుణాచల డైమండ్, సిక్కిం డేటా, సిక్కిం సూపర్ పేరుతో రూ.50 నుంచి రూ.150 ధరలతో మార్కెట్లో నకిలీ టిక్కెట్లు అమ్ముతున్నారు. వీటి ధర ఆధారంగా విజేతలకు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ పలుకుతాయని ఆశ చూపుతున్నారు.
శ్రీకాకుళంలో ఏజెంట్లు...: తెనాలికి చెందిన ఓ వ్యక్తి దీనికి కీలక సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. ఇతని కనుసన్నల్లో జిల్లా కేంద్రంలో 12 మంది టిక్కెట్లు అమ్మే ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. నగరానికి చెందిన ఒకరి వద్ద 25 మంది సబ్ ఏజెంట్లు కూడా పని చేస్తున్నారు. రోజుకు ఒక్కొక్కరు దాదాపు రూ.30 వేల వరకూ లాటరీ టిక్కెట్లు అమ్ముతారు. అంటే రోజుకు సుమారు రూ.7.50 లక్షల వరకు వ్యాపారం చేస్తున్నారని మాట. మరో ఆరుగురు ఏజెంట్లు సుమారు రూ.11 లక్షల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. మిగిలిన వారంతా కలిపి రోజుకు దాదాపు రూ.50 లక్షలకు పైగా వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.