engineering student arrested in Ap: అతడు ఇంజనీరింగ్ విద్యార్థి, అతని తల్లిదండ్రులు తమ కొడుకు ఉన్నత చదువులు చదివి తమను ఉద్దరిస్తాడని ఆశ పడ్డారు. అందుకోసం తమ తాహతకు మించి చదువులు చదివిస్తున్నారు. అయితే, ఆ విద్యార్థి మాత్రం చదువును పక్కనపెట్టి అడ్డదారులు తొక్కడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తూ... వ్యసనాలకు బానిసగామారాడు. డబ్బుల కోసం చోరీలకు పాల్పడటం మెుదలు పెట్టి పోలీసులకు పట్టుబడిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది.
ఆన్లైన్ క్రీడలకు అలవాటు పడి, చెడు వ్యసనాలకు బానిసై సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురాశకు లోనై... ఏటీఎం కార్డులను తారుమారు చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 16 నకిలీ ఏటీఎం కార్డులు డెబిట్ కార్డులు ఒక చరవాణి, నాలుగు వేల రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి అరెస్ట్ అయిన విద్యార్థి మీడియా ఎదుట హాజరు పరిచారు. చిత్తూరు జిల్లా నగిరి మండలానికి చెందిన వెంకటేష్ విజయవాడలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్స్ చదువుతున్నాడు. మెుదట చదువుల్లో రానించినా ఆపై ఆన్లైన్ క్రీడలకు అలవాటు పడ్డినట్లు పోలీసులు తెలిపారు. ఆటల్లో లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు.