Cryptocurrency News: మనకు తెలియకుండానే వాట్సాప్ గ్రూపులో మన నంబర్ చేరుస్తారు. అందులో అరసెకనుకో మెసేజ్ వస్తుంది. ఒకడు నా లాభం లక్ష అంటాడు. మరొకడు నా ఖాతాలో 5లక్షలు చేరిందంటాడు. మరొకడు 10 లక్షలు వచ్చాయి కారు కొంటున్నా అంటాడు. ఆశపడి అరసెకను ఆలోచించావా! అంతే!! నాకూ లాభాలు కావాలని ఆశపడ్డావా ఇక నీ ఖాతాలో కాసులకు మంగళం పాడినట్లే! వేలల్లో పెట్టుబడులు లక్షల్లో లాభాలు, రోజూ డాలర్లలో సంపాదించవచ్చంటూ... ఈ మధ్య సైబర్ నేరగాళ్లు పన్నుతున్న ఉచ్చుకు అనేకమంది బలవుతున్నారు.
క్రిప్టోలో పెట్టుబడులు, మీ తరఫున మేం లావాదేవీలు మేం నిర్వహిస్తాం. అమెరికన్ డాలర్లలో మదుపు చేసిన డబ్బును మీరు ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ... సైబర్ నేరస్థులు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. మెట్రోనగరాలు, పట్టణాల్లో ఉద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకొని టోకరా వేస్తున్నారు. తొలుత ఫోన్ నంబర్లు సేకరించి వారిని వాట్సాప్ బృందాల్లోకి చేరుస్తారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మించి పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఇలా హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు నెలల్లో ఏకంగా 20కోట్ల 50లక్షలు కొల్లగొట్టారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారుల అధికారిక ఫోన్ నంబర్లనూ... వాట్సాప్ బృందాల్లో చేర్చడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.