తెలంగాణ.. రాంపల్లి ఆర్‌ఎల్‌నగర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని బుధవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో 'తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు' తల్లికి ఫోన్‌చేసి చెప్పింది. ఆమె డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సెల్‌ఫోన్ సంకేతాల ఆధారంగా అన్నోజీగూడ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర బాధితురాలిని గుర్తించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత 'తనపై కొందరు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని' ఆమె చెప్పడంతో అనుమానంతో నలుగురు ఆటో డ్రైవర్లను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒంటరిగానే సంచరించిన యువతి
బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు గురువారం రాత్రి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు, బాధితురాలు చెప్పిన వివరాలకు పొంతన కుదరకపోవడంతో అనుమానంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. ఆ క్రమంలోనే బాధితురాలు సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఘట్‌కేసర్, యంనంపేట్, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ సంకేతాలు ఆ ప్రాంతాల్లో లేవనీ తేల్చారు. ఆ కోణంలో మరోసారి బాధితురాలిని ప్రశ్నించగా 'చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదేపదే ఫోన్ చేస్తుండటంతో ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకెళ్లాడని' చెప్పానని యువతి అంగీకరించినట్టు తెలిసింది.