Mystery deaths in Karimnagar : ఓ కుటుంబంలో వరుస మరణాలు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. తీవ్ర విషాదం నింపుతోంది. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు మరణించగా.. తాజాగా భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్-మమతలు భార్యాభర్తలు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాలూకాలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా తెలియని అలజడి మొదలైంది. అంతుచిక్కని వ్యాధితో మమత, ఇద్దరు పిల్లలు రెండు నెలల క్రితం మరణించారు. ఈ విషాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్.. ఈరోజు ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.