అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గొల్ల గోపాల్ (45) అనే వ్యక్తి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గోపాల్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం ముందు గ్రామస్థులంతా కూర్చున్నారు. గోపాల్ మద్యం తాగి అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా, వైకాపా కార్యకర్త శ్రీనివాసులు వచ్చి గొడవ పడ్డారు. గ్రామ పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పి ఇళ్లకు పంపించి వెళ్లి పోయారు. కానీ శ్రీనివాసులు మద్యం మత్తులో.. గోపాల్ ఇంటికి వెళ్లి రాళ్లతో, కర్రలతో దాడి చేసి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు బెలుగుప్ప మండలం గుండ్లపల్లిలోని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు తెలిపారు.
గతంలోనూ వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షలే హత్యకు ప్రధాన కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. గోపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో.. గడచిన 7 రోజుల వ్యవధిలో పల్లెల్లో హత్యలు, ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల ప్రజల నుంచి పోలీసు శాఖపై విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో శాంతి భద్రతలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.