Mother and Child Death : నవ మాసాలు మోసి, కన్నబిడ్డను కళ్లారా చూడాలని ఆమె ఎంతగానో ఆశించింది. తొలి కాన్పు నిమిత్తం కుటుంబసభ్యులు ఆమెను సర్కారీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాన్పు క్లిష్టమయ్యేలా ఉందని వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి మరో ఆసుపత్రికి.. తర్వాత ఇంకో ఆసుపత్రికి ఇలా నాలుగు ప్రభుత్వాస్పత్రులకు తిరిగారు. ఎక్కడా వైద్యం అందలేదు. చివరికి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రి వైద్యులు ఆమెను చేర్చుకుని సాధారణ ప్రసవం చేసినా ప్రయోజనం లేకపోయింది. తల్లీబిడ్డలిద్దరూ కన్నుమూశారు. హృదయవిదారకమైన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఎల్మపల్లికి చెందిన చారగొండ స్వర్ణ (24) కాన్పు కోసం పదర మండలం వంకేశ్వరంలోని పుట్టింటికి వెళ్లారు. సోమవారం రాత్రి ఆమె ప్రసవ వేదన పడుతుండటంతో తల్లిదండ్రులు 108 అంబులెన్సులో 4 కిలోమీటర్ల దూరంలోని పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించి.. 10 కిలోమీటర్ల దూరంలోని అమ్రాబాద్ ఆసుపత్రికి పంపించారు.
అక్కడి సిబ్బంది తమ వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ 25 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట దవాఖానాకు పంపారు. అక్కడ ప్రాథమిక వైద్య సేవలందించిన సిబ్బంది.. బీపీ అదుపులోకి రాకపోవడంతో మరో 35 కిలోమీటర్ల దూరంలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సిబ్బంది మరో 50 కి.మీ. దూరంలోని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి వెళ్లమన్నారు. దీంతో స్వర్ణ కుటుంబీకులు ఆమెను తీసుకొని రాత్రి 2 గంటలకు మహబూబ్‌నగర్ ఆసుపత్రికి చేరుకోగా.. వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు.