Remand Report on Naveen Reddy: తెలంగాణలో వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. గతేడాది బొంగులూరులోని స్పోర్ట్స్ అకాడమీలో యువతితో నవీన్ రెడ్డికి పరిచయమైందని రిమాండ్ రిపోర్ట్‌లో తేలింది. ఆమె మొబైల్ నెంబర్ తీసుకొని తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసిన నవీన్ రెడ్డి.. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని బాధిత యువతితో కలిసి ఫోటోలు తీసుకున్నాడని తెలుస్తోంది.
పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం... నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని యువతి చెప్పింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించిన నవీన్ రెడ్డి. పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. యువతి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఇద్దరూ దిగిన ఫోటోలను వైరల్ చేశాడు. ఐదు నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకుని తాత్కాలిక షెడ్డు వేసిన నవీన్ రెడ్డి ఆగస్టు 31న గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9వ తేదీన యువతికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్న నవీన్ రెడ్డి అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు.