హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. యువతి అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, బంధువులు.. యువకుడిని చితకబాది గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
వట్టి నాగులపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్ కేపీహెచ్‌బీలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయి మాదాపూర్‌లో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి ప్రేమ్‌సింగ్ తమ ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. యువతికి స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాగిన మైకంలోనే యువకుడు హత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన ప్రేమ్‌సింగ్‌ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.