'నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది.. ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.. కాదని నువ్వు పెళ్లికి సిద్ధమైతే చంపేస్తా' అంటూ ఇన్‌స్టాలో బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్‌కు చెందిన వివేక్ అనే యువకుడి కుటుంబం బేగంబజార్‌లో స్థిరపడింది. వివేక్ మల్కాజిగిరి సఫిల్‌గూడలో ఉండే తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. మరో రెండు నెలల్లో పెళ్లి ఉంది.
విషయం వివేక్‌కు తెలిసింది. పెళ్లిని ఆపేయాలని భావించిన వివేక్.. ఇన్‌స్టాలో 'నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయి నాది.. కాదని నువ్వు పెళ్లికి సిద్ధమైతే చంపేస్తా' అంటూ పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి మెస్సేజ్ చేశాడు. సందేశం చూసి అబ్బాయితో పాటు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇలా వరుసగా సందేశాలు వస్తుండటంతో అమ్మాయి తల్లిదండ్రులను నిలదీశారు. పెళ్లిని రద్దు చేసుకున్నారు.