ఏటీఎం యంత్రాల్లో నుంచి నగదు మాయమవుతోంది. దొంగలు పడ్డారా! అంటే లేదు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. మరి డబ్బులెలా పోతున్నాయి? పైగా ఓ ప్రధాన బ్యాంకు ఏటీఎంలలోనే నగదు మాయమవడం ఏమిటి? ఈ విషయమే కొంత కాలంగా ఆ బ్యాంకు అధికారులను తలలు పట్టుకునేలా చేస్తోంది. పోలీసులు దర్యాప్తు ఆరంభించడంతో ఇదంతా హరియాణా ముఠా పనిగా తేలింది. ఈ ఘటన తెలంగాణలో జరిగింది.
బయటపడిందిలా..
హైదరాబాద్.. విద్యానగర్ ప్రాంతంలో ఉన్న తమ ఏటీఎం కేంద్రంలోని డిపాజిట్ యంత్రం నుంచి రూ.50 వేలు మాయమైనట్టు ఓ బ్యాంకు అధికారులు జూన్ 19న నల్లకుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ఆరంభించిన పోలీసులు జూన్ 18న ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అయిదు దఫాలుగా నగదు డ్రా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు గుట్టు బయటపడింది. ‘హరియాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైదాబాద్‌లో ఆటో ఎక్కారు. అంతకుముందు సైదాబాద్‌లోని అదే బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి రూ.1.24 లక్షలు డ్రా చేశారు. నాగోల్‌లోనూ ప్రయత్నించారు. అక్కణ్నుంచి విద్యానగర్‌కు వచ్చారు. చిక్కడపల్లి వీఎస్‌టీ వద్ద ఉన్న ఏటీఎం నుంచి రూ.3 లక్షలు తస్కరణకు గురైనట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కొంతకాలం కిందట ఫిర్యాదు అందింది. తిరుమలగిరి, హయత్‌నగర్‌లలోనూ ఇలానే జరిగింది. ఈ దొంగతనాలు కూడా ఆ ముఠా పనేననే నిర్ధారణకు వచ్చాం’ అని పోలీసులు తెలిపారు.