ప్రేమ వ్యవహారంపై పెద్దలు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి వడ్డాదిలో చోటుచేసుకుంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బుధవారం ఉదయాన్ని ఆమె మృతదేహాన్ని నదిలో నుంచి బయటకి తీశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...
SUICIDE ATTEMPT: ప్రియుడితో వాగ్వివాదం.. ఆపై ఆత్మహత్య.. - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
ప్రేమించినవాడే జీవితం అనుకుంది ఆ అమ్మాయి. అతనితో కలిసి ఏడు అడుగులు నడవాలనుకుంది. కానీ కన్నవారి దాకా వెళ్లింది. వారు మందలించడంతో నదిలోకి దూకి ప్రాణాలు విడిచింది. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో ఈ విషాధ ఘటన జరిగింది.
వడ్డాది గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన మేనత్త దగ్గర ఉంటూ ఖాళీ సమయంలో ఆమె దుకాణంలోనే పని చేస్తుండేది. బంగారుమెట్ట గ్రామానికి చెందిన యువకుడు చోడే రాము (26) తరచూ దుకాణం దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడుతుండేవాడు. ఇలా ఇద్దరి మధ్య ఏడాది నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది. ఇద్దరికి పెళ్లి చేసేద్దామని యువకుడి కుటుంబ సభ్యులు మాట్లాడడానికి వెళ్లినా బాలిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినా ఆ యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆ బాలిక వెంట పడి తిరిగేవాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి ఇరు కుటుంబాల వారు మరోసారి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో బాలిక, ఆమెను ప్రేమించిన యువకుడు అక్కడే ఉన్నారు. పెద్దలు ఆమెను మందలించడంతో మనస్తాపం చెందిన వెంటనే పరిగెత్తుకుని వెళ్లి పెద్దేరు నదిలోకి దూకేసింది. ఆమె వెంట యువకుడు కూడా పరుగు తీయగా నదీ తీరంలో ఉన్నవారు అడ్డుకున్నారు. బాలిక కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. ఉదయం గాలించగా వడ్డాది సంతబయలు దగ్గర ఆమె మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. చోడవరం సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్, ఎస్సై బి.రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రేమపేరుతో చేసిన వేధింపులే బాలిక ఆత్మహత్యకు కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అతడిని అరెస్టు చేసి కోర్టుకి తరలించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:Brutal Incident: బిడ్డకు అమ్మతనాన్ని దూరం చేసిన తల్లి..