Miyapur Incident: ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే కక్షతో ప్రేమోన్మాది చెలరేగిపోయాడు. కత్తితో యువతి, ఆమె తల్లిపై దాడి చేశాడు. తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ కాలనీలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువతి, ఆమె తల్లి.. సోదరుడితో కలిసి 8నెలల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చారు.
గుంటూరులో ఉంటున్న సమయంలో యువతికి రేపల్లెకు చెందిన సందీప్‌తో పరిచయం ఏర్పడింది. మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి నిశ్చితార్ధం కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. మనస్పర్థలు రావడంతో కొద్దికాలంగా యువతి.. సందీప్‌ను దూరం పెడుతూ వచ్చింది. అతనితో మాట్లాడడం మానేసింది. సందీప్ తరచూ యువతికి ఫోన్ చేయడంతోపాటు.. వాట్సాప్ సందేశాలు పంపుతూ బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.
రేపల్లె నుంచి మియాపూర్‌కు వచ్చిన సందీప్:రేపల్లె నుంచి మియాపూర్‌కు వచ్చిన సందీప్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. సందీప్ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఇదే క్రమంలో అడ్డువచ్చిన యువతిపైనా దాడి చేసి.. అనంతరం కత్తితో గొంతు కోసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.