Loan Apps Fraud News: వ్యక్తిగత పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్న రుణ యాప్ నిర్వాహకులు... దారుణాలకు తెగబడుతున్నారు. రుణం ఇచ్చేముందు ఆధార్ కార్డు, చరవాణిలో కాంటాక్ట్ లిస్ట్ కావాలంటూ అనుమతులు తీసుకుంటున్నారు. అనంతరం నాలుగు రోజులకే ఫోన్ చేసి అసలు, వడ్డీ కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. వారం, పదిరోజుల వరకు గడువుందని బాధితులు చెబుతున్నా వినకుండా వరుసగా ఫోన్లు చేస్తున్నారు. బాధితుల కాంటాక్ట్ లిస్ట్‌లో యువతులు, మహిళల పేర్లు పరిశీలిస్తున్నారు.
వాట్సాప్ డీపీలో ఫోటో ఉంటే సేకరించి నగ్నంగా మార్ఫింగ్ చేసి ఆ యువతులు, మహిళల చరవాణులకు పంపుతున్నారు. ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతున్న ఆ యువతులు, మహిళలు... రుణం తీసుకున్నవారికి ఫోన్ చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. అప్పుతో తమకు సంబంధం లేకున్నా ఫోన్లకు నగ్నచిత్రాలు రావడంతో యువతులు, మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.