ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కామారెడ్డి ఆత్మాహుతి కేసులో వేగం పెంచిన పోలీసులు.. ఏ1గా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్..!! - కామారెడ్డి పోలీసులు

Mother Son Suicide Case: తెలంగాణలోని కామారెడ్డిలో సంచలనంగా మారిన తల్లీ, కుమారుడు ఆత్మాహుతి కేసులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఏడుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక విచారణాధికారిని నియమించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలతో గాలిస్తున్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మెదక్ జిల్లా వ్యాప్తంగా భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు.

Mother Son Suicide Case
కామారెడ్డి ఆత్మాహుతి కేసులో వేగం పెంచిన పోలీసులు

By

Published : Apr 18, 2022, 7:10 AM IST

Mother Son Suicide Case:తెలంగాణలోని కామారెడ్డిలో తల్లి గంగం పద్మ, కుమారుడు గంగం సంతోష్‌ ఆత్మాహుతి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మృతుల సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియో, ఆడియో ఆధారంగా ఏడుగురిపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై ఏ1 పల్లె జితేందర్‌గౌడ్‌, ఏ2 సరాబ్‌ యాదగిరి, ఏ3 ఐరేని పృథ్వీగౌడ్‌, ఏ4 తోట కిరణ్‌, ఏ5 కన్నాపురం కృష్ణా గౌడ్‌, ఏ6 సరాబ్‌ స్వరాజ్‌, ఏ7 సీఐ నాగార్జున గౌడ్‌పై కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కామారెడ్డి ఆత్మాహుతి కేసులో వేగం పెంచిన పోలీసులు

మెదక్ జిల్లాకు చెందిన తల్లీకొడుకులు పద్మ, సంతోష్‌లు కామారెడ్డిలోని ఓ లాడ్జిలో ఆత్మాహుతి చేసుకున్నారు. శరీరానికి నిప్పంటించుకుని చనిపోయారు. ఆత్మహత్యకు ముందు సంతోష్, అతని తల్లి పద్మ... వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. సంతోష్ ఆరు పేజీల మరణ వాంగ్మూలం రాయడంతోపాటు 22నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఆడియో రికార్డు చేసి పెట్టారు. ఇందులో రామాయంపేటకు చెందిన ఏడుగురు తమ మరణానికి కారణమని వెల్లడించారు. ఈ ఏడుగురిలో రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఐరేని పృథ్వీరాజ్ అలియాస్ బాలు, రామాయంపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ సరాబ్ యాదగిరి, అతని కుమారుడు సరాబ్ స్వరాజ్‌, తోట కిరణ్, కన్నాపురం కృష్ణాగౌడ్‌, రామాయంపేటలో గతంలో సీఐగా పని చేసిన, ప్రస్తుత తుంగతుర్తి సీఐ నాగార్జునగౌడ్ పేర్లను పేర్కొన్నారు. తమ చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలని వేడుకున్నారు.


తల్లీకొడుకుల ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలంటూ మెదక్ జిల్లాలో భాజపా ఆందోళన చేపట్టింది. మెదక్, హవేలి గణపూర్, నిజాంపేటలో భాజపా కార్యకర్తలు నిరసన తెలిపారు. సంతోష్‌ను వేధింపులకు గురి చేసి అతడి మృతికి కారణమైన తెరాస నాయకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే తెరాస నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఆందోళన చేపట్టిన భాజపా నాయకులను మెదక్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే: రామాయంపేటకు చెందిన తల్లీ, కుమారుడు ఆత్మాహుతి చేసుకున్న బాధితుల కుటుంబాన్ని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వారి ఆత్మహత్యలకు జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని కోరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేనిపక్షంలో సీబీఐ విచారణ కోరతామని రఘునందన్ రావు అన్నారు.

'పోలీసులపై మాకు ఎలాంటి కోపం లేదు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. తప్పు చేసినవారిని శిక్షించాలి. ఏడాది కాలంగా స్టేషన్లు చుట్టూ తిరిగినా ఎస్పీ, మంత్రి, ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు. దీని వెనక ఉన్న మతలబు ఏంటి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి. లేనిపక్షంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. ఒక న్యాయవాదిగా ఆ కుటుంబానికి అండగా ఉంటా.' - రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

పరామర్శించిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ: రామాయంపేటలో బాధితుల కుటుంబాన్ని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరామర్శించారు. తల్లీ, కుమారుడు ఆత్మహత్యలకు కారణమైన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్​, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సరాఫ్ యాదగిరిని వెంటనే పదవుల నుంచి తొలగించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా బంద్​కు పిలుపునిస్తామని హెచ్చరించారు. రాష్ట్రం తెరాస నాయకుల చేతుల్లో బందీగా మారిందని షబ్బీర్ అలీ మండిపడ్డారు.

'అధికార పార్టీ నాయకులు బెదిరింపులతో తల్లితో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. గతంలో ఇలాంటివీ జరిగేవి. ఇప్పుడు ఏ వ్యాపారం చేసినా కమిషన్లు ఇవ్వాలా? ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ నుంచి మున్సిపల్ ఛైర్మన్ వరకు మాముళ్లు ఇచ్చుకుంటా పోవాలా? పోలీసులందరూ ఏం చేస్తున్నారు. డ్యూటీలు చేయకుండా నాయకులకు కొమ్ము కాస్తున్నారు.' - షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత

ఇదీ చదవండి:కేంద్రం కీలక నిర్ణయం...ఉపాధి పనులకు నేరుగా చెల్లింపులు

ABOUT THE AUTHOR

...view details