Jubilee Hills gang rape case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువెనైల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటికే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. రెగ్యులర్ న్యాయస్థానంలో విచారణ జరిగి నిందితులపై నేరం రుజువైతే కఠినశిక్షపడే అవకాశం కనిపిస్తోంది. మే28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్ ఇన్‌సోమ్నియా పబ్ నుంచి ఒక బాలిక (17)ను తీసుకెళ్లి ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే.