Inter First Year Student Suicide : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు కుంగిపోతున్నారు. తక్కువ మార్కులొచ్చాయని బాధలో ఉన్న పిల్లలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి కొందరు తల్లిదండ్రులు వారిని మందలిస్తున్నారు. అది తట్టుకోలేని కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండలో చోటుచేసుకుంది.
మార్కులు తక్కువొచ్చాయని..
Nalgonda Student Suicide : నల్గొండ గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి(16) ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గతేడాది కరోనా వల్ల నిలిచిపోయిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇటీవలే నిర్వహించగా.. వాటి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని జాహ్నవిని ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఓవైపు పరీక్షల నిర్వహణలో ఏర్పడిన గందరగోళం.. మరోవైపు ఆన్లైన్ తరగతుల అయోమయంతో ఎంతో కష్టపడి చదివిన తనకు తక్కువ మార్కులొచ్చాయని బాధపడుతున్న జాహ్నవిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. క్షణికావేశానికి లోనై.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.