హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్కు చెందిన ఓ బట్టల వ్యాపారి దుకాణానికి ఓ వ్యక్తి వచ్చాడు. రూ.20 వేలు విలువ చేసే దుస్తులు కొన్నాడు. బిల్లును పేటీఎం ద్వారా చెల్లిస్తానన్నాడు. యజమాని పేటీఎం నంబర్ తీసుకుని రూ.20 వేలు బదిలీ చేసి వెళ్లిపోయాడు. ఆరోజు లెక్కలు చూసుకున్న యజమాని ఆ దుస్తుల తాలూఖ నగదు అతని ఖాతాలో జమ కాలేదని గుర్తించాడు. పేటీఎం కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు అసలు ఆ సమయంలో పేమెంట్ ఏమీ జరగలేదని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు.
8 మందిని అరెస్ట్..
వెంటనే కంచన్బాగ్ పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ద్వారా నిందితుడిని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నకిలీ పేటీఎం యాప్ ద్వారా ఈ పేమెంట్లు చేసినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. ఇదే తరహా కేసులు చాంద్రాయణ గుట్ట, మీర్చౌక్లో నమోదయ్యాయి. మొత్తం 4 కేసుల్లో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలిపారు.