కార్వీ కేసులో (KARVY) మరో ఇద్దరు అరెస్టయ్యారు. కార్వీ సీఎఫ్వో కృష్ణ హరి, సీఈవో రాజీవ్ సింగ్ను అరెస్టు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. కార్వీ ఛైర్మన్ పార్థసారథి ఆదేశాలతో వీరు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసినట్లు సమాచారం. ఏడేళ్లుగా కృష్ణహరి, రాజీవ్ సింగ్ డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ కేసు..
ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి రూ.137 కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో కార్వీ ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ నెల 19న అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. కేసులో పురోగతి కోసం నాంపల్లి న్యాయస్థానం అనుమతితో సీసీఎస్ పోలీసులు ఈనెల 26, 27 తేదీల్లో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. పార్థసారథి నుంచి పెద్దగా సమాధానాలు రాకపోవడంతో మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో విచారించి.. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్వీ సంస్థకు సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు... ఆయా బ్యాంకుల్లో లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకుల్లో ఏ విధంగా తనఖా పెట్టారనే విషయాలను పార్థసారథి నుంచి రాబట్టారు. కార్వీ ఆడిట్ నివేదకను పార్థసారథి ముందుంచి... దానికి సంబంధించిన వివరాలను సేకరించారు. పలు బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాన్ని... ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలను పార్థసారథి నుంచి సేకరించారు.