ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దంపతుల మధ్య గొడవ.. భర్తను హత్య చేసిన భార్య - visakha crime news

ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తన బుద్ది మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేదు. అయితే పిల్లల్ని, తనను కొట్టడాన్ని సహించలేకపోయింది. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎదురు తిరిగింది. దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్తపై దాడి చేసింది.

husband murder at visakha
భర్తను హత్య చేసిన భార్య

By

Published : Mar 20, 2021, 1:02 PM IST

తనను తాను రక్షించుకునే క్రమంలో ఇనుపరాడ్డుతో భర్త తలపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన ఘటన విశాఖలోని 1వ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. విశాఖలోని 35వ వార్డు ద్వారంవారివీధిలో పూసర్ల పుండరీకాక్ష, పుణ్యవతి దంపతులు నివాసముంటున్నారు. వాళ్లకు కుమార్తె(18), కుమారుడు(14) ఉన్నారు. పుండరీకాక్ష అల్పాహారం దుకాణం నడుపుతూ.. శుభకార్యాలకు క్యాటరింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలో ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం భార్యకు తెలియడంతో ఇద్దరిమధ్య తరచూ గొడవలు జరిగేవి. పుండరీకాక్ష.. భార్య, పిల్లలను విచక్షణారహితంగా కొట్టేవాడు. పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు.

ఈనెల 10న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో.. ఇద్దరి పిల్లలను తీసుకోని కురుపాం మార్కెట్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. ఈనెల 18న తిరిగి పిల్లలతో భర్త దగ్గరికి రాగా.. రాత్రి ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. దీంతో పుణ్యవతి.. పిల్లలను వంటి గదిలో పెట్టి గడియ వేసింది. భార్యాభర్తలు తీవ్ర ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో పుణ్యవతి తనను తాను రక్షించుకోవడానికి ఇనుపరాడ్డుతో భర్త పుండరీకాక్ష తలపై విచక్షణారహితంగా దాడి చేసింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పుణ్యవతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓవైపు తండ్రి మరణించడం.. మరోవైపు తల్లి అరెస్టుతో ఆ పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఇదీ చూడండి:హిజ్రా దారుణ హత్య.. డీజిల్‌ పోసి తగలబెట్టిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details